పంచి ఇవ్వడమే
పరమావధిగా జీవించేది ఆమే..
ఎంగిలిచేసి ,రుచి చూసి
రాముడి ఆకలి తీర్చిన శబరి
భిక్షాటన చేసి
బిడ్డల ఆకలి తీర్చిన కుంతి
అప్పటికీ
ఇప్పటికీ
కాలమేదైనా
ప్రేమేనుపంచే అమృత ధార ఆమే
కడుపు తీపి కోసం
కన్నవారికోసం
బంధాల కోసం బందీ అయి
చివరి పంక్తిలో
ఆఖరి విస్తరిగా మిగిలే సహన రూపం ఆమే
మానాన్ని గాయాల చెట్టు చేసినా
దేహాన్ని తాకట్టు పెట్టినా
గర్భ సంచీ అద్దెకిచ్చినా
ఎక్కడో..
ఎవర్నో..
వుద్దరించేందుకు త్యాగ ఫలమయ్యేది ఆమే
పగలు నిప్పులు కక్కే సూర్యుణ్ణి
రాత్రి వెన్నెల చిందే చంద్రుణ్ణి
సమంగా భరించే ఆకాశంలో సగం ఆమే
సాధికారత వున్నా ,లేకున్నా
కొత్త చట్టా లిచ్చే శాతం ఎంతైనా
నూటికి నూరు శాతం
పంచి ఇవ్వడమే
పరమావధిగా జీవించేది మాత్రం ఆమే..!
పెరుగు.సుజనారామం
నెల్లూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి